Wednesday, August 31, 2016
Monday, August 29, 2016
తెలుగు బావుటా
పల్లవి: తీపినద్దాను తేనెకే
రూపునిచ్చాను వాణికే
ఊతమైనాను ఉనికికే
పోయమంటుంటె ఊపిరే
ఆర్పివేస్తావు దీపమే
చీకటేనాకు వెలుగంటు
అంధుడౌతావ ఆంధ్రుడా
చరణం: భువనం నిండిన ప్రాభవం
బలిచేస్తుంటే ఈ తరం
గురుతుకొస్తుందే నా గతం
మూగవోతోంది సుస్వరం
బలినే తొక్కిన బాపడై
పెరుగుతుంటేను పాపడే
బ్రతకనిచ్చునా నన్నింక
ఆ గీర్వాణీ పతియైన ll తీపి ll
చరణం: ఓనమాలుగా గెలిపించు
అమ్మ ప్రేమగా లాలిస్తా
పదముపదమున నను పలుకు
పూలవానలే కురిపిస్తా
నలుగురొక్కటై కాంక్షిస్తే
నాలుగుదిక్కుల నవ్వనా
మదిమదిలోనూ చోటిస్తే
తెలుగువెలుగులే పంచనా ll తీపి ll
Wednesday, August 24, 2016
నీడ
నీడ
-----------------
ఎన్నెన్ని అందాలు గలవే! నీ మేన,
అన్నిటిని ముద్దాడ మనసాయె నో భామ.
సరే నటంచు నీవు బల్కిన చాలు,
అణువణువు నిను తాకి
రమణి నీకిత్తు రమ్యమైన కాన్క లెన్నో!
అని, ఆ వెలుగు పుడమిని వేడ!
అనుమతించిన పుడమిని అణువణువూ తాకి
ఆ వెలుగిచ్చిన కానుకలేనోయ్ నీడలు!!!!!
Saturday, July 16, 2016
అవునా?
విశ్వసించలేక, ఎవరికి వారైన
మనిషినీ,మనిషినీ వదిలి
వికసించలేని
మనసునీ, మనిషినీ వదిలి
వర్ధిల్లలేని
మానవతనీ, మనిషినీ వదిలి
విస్తరించలేని
విలువలనీ, మనిషినీ వదిలి
విశ్వంలోని దూరాలనటోయ్!
కాంతి సంవత్సరాల పేరిట
నువ్వు కొలిచేది.
Saturday, July 2, 2016
పాపం
అంతరించి పోయిన జీవులు
కనీసం పుస్తకాల మాటునైనా
పరిచయమౌతున్నవి గాని!
ఏమి పాపము చేసినవో
చుట్టూనున్న ఈ చెట్టు చేమలు
ఆ కార్పొరేట్ బడి పిల్లల చూపుల కందక!
Wednesday, June 22, 2016
ఏమిటోయ్ ?
పదునెక్కే ప్రేమతో ఓ వైపు
పదును తగ్గని పగతో ఇంకో వైపు!
రెండు వైపులా తనకు పదునే అంటూ,
నిస్సుగ్గుగా! విలువల గొంతుకలు
తెగనరికే, కరవాలమైనదేమిటోయ్
మన తెలుగు సినిమా.
Tuesday, June 21, 2016
కాదంటావా?
బొడ్డు పేగులను పిండుకుని,
చితి మంటలలో వండుకుని!
కడుపు నింపుకునే తత్వాన్ని
ఆ లంచానికి
అలవాటు చేసింది,
మన అలసత్వమే కదటోయ్!
Subscribe to:
Posts (Atom)