Saturday, July 16, 2016
Saturday, July 2, 2016
పాపం
అంతరించి పోయిన జీవులు
కనీసం పుస్తకాల మాటునైనా
పరిచయమౌతున్నవి గాని!
ఏమి పాపము చేసినవో
చుట్టూనున్న ఈ చెట్టు చేమలు
ఆ కార్పొరేట్ బడి పిల్లల చూపుల కందక!
Wednesday, June 22, 2016
ఏమిటోయ్ ?
పదునెక్కే ప్రేమతో ఓ వైపు
పదును తగ్గని పగతో ఇంకో వైపు!
రెండు వైపులా తనకు పదునే అంటూ,
నిస్సుగ్గుగా! విలువల గొంతుకలు
తెగనరికే, కరవాలమైనదేమిటోయ్
మన తెలుగు సినిమా.
Tuesday, June 21, 2016
కాదంటావా?
బొడ్డు పేగులను పిండుకుని,
చితి మంటలలో వండుకుని!
కడుపు నింపుకునే తత్వాన్ని
ఆ లంచానికి
అలవాటు చేసింది,
మన అలసత్వమే కదటోయ్!
Monday, June 20, 2016
ఏమో?
పెరుగుతున్న నిత్యావసరాల ,
ధరల పుణ్యమా అని!
తాను కూడా
ఆదాయపు పన్ను కట్టించే
జాబితాలో చేరిపోతుందేమో
కడుపు నిండుగా చేసే భోజనం.
Tuesday, June 14, 2016
ఎవరో ఆమె?
రాతిరేల, ఆమె ఎవరో?
కడలి సైతం మనసుపడేటన్ని,
నిధులతో బయలుదేరింది.
మనిషి మనిషినీ ఆపింది,
మనసు మనసునీ అడిగింది.
రాతిరికి, తనకాశ్రయమీయమని
కలల వేణువు నూదుతూ
మీతో కలసిపోతానని.
మా కలతలు మావిలేమ్మా!
నీ కలలు మాకెందుకంటూ
అందరూ ఆమె నుండి దూరంగా జరిగారు
చేసేది లేక దారి పట్టి పోతున్న ఆమెను
పసి మనసులు పొదుగుకున్నాయి.
అందుకై ఆమె
ఆదమరిచే హాయి నిధులను వారికిచ్చి
వారి మూగ నవ్వులతో
తనకు జోల పాడించుకుంటుంది
వేళనక, పాళనక.
Monday, April 18, 2016
మినీ కవితలు
నాగరికత
అవమానం అనుకోపోతే
నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా!
నడిరోడ్డుపై పోతున్న మానమే.
******
అనుభవాలవిందు
కడుపునిండా తినకుండా
తనకు తానే,ఎంత బరువై తోచిందో,
కడుపునిండుగా మెక్కి
తానంత తేలికైపోయింది, నా మనసు!
అనుభవాలు, విందు చేసే వేళ.
*********
కష్టార్జితపు మత్తు
ఆమె పిల్లల ఆకలి మంటల్లో
ఆతని కష్టార్జితపు మత్తు
చమురు పోస్తుంది.
******
కన్నీళ్లు
విడిచిన ప్రతి సారీ
గమ్యాన్ని చేరడం తెలిస్తే!
జీవితాంతమూ పోషించే వారెవ్వరూ చెప్పు
ఈ కన్నీళ్లను.
ఈ కన్నీళ్లను.
*********
Subscribe to:
Posts (Atom)