Saturday, August 15, 2015

మినీ కవితలు

మినీ కవితలు 

వెన్నెల్లో, సాలె గూటి వల వేసి

అందిన కాడికి ఆ నక్షత్రాలను 

పట్టేశానోయ్! 

తక్కువైపోయాయంటే ఎట్టామరి 

*************

తన వైపుకు నా అడుగులు 

పడుతున్నాయన్న ధీమాతో 

తను ఎదగడం మొదలు బెట్టిందా కొండ 

***************

నావికుణ్ణి వెతుక్కుంటూ 

వచ్చే తీరం కదటోయ్ 

వసంతం

************** 




Tuesday, July 28, 2015

కలాం

కలాం 

తలలో తక్షశిలతో పుట్టావా ఏమిటోయ్ నువ్వు?

లేకుంటే నీ నాడులన్ని నలందకు దారులౌతాయా ఇలా. 

విశ్వానికే వన్నె తేలా! గెలవాలన్న నీ సంకల్పం 

గెలిచి వినమ్రతకే వన్నె తేలా ! ఒదిగిన నీ వ్యకిత్వం 

అంకెలకందని విజయాలు సాధించి 

మాటలకందని మౌనాన్ని మిగిల్చావా కలాం?

అందుకే అంటాను నిస్సందేహంగా నేను 

చరిత్ర, ఎOదరినో చిరంజీవులని చేస్తే!

మా భవితకు అమరత్వమీయగలిగేది మాత్రం 

నీ జీవిత చరిత్రేనని  

Friday, July 24, 2015

ఆవిష్కరించు


పొంగిన లావా, పచ్చని బయలైనట్లు  


పొంగిన కన్నీరు పచ్చని బ్రతుకీయదేమి?

 

కడకు చేరిన అలలకు నురుగు నవ్వులు తోడైనట్లు గాక

 

తుదికి చేరిన ముదిమికి మోదమెందుకాయే ఎoడమావి?

 

ఊహాశ్వ సారధ్యాన అందుకున్న స్వర్గపు ఆతిధ్యానికై 

 

మది దాటి మిన్నునంటదేమి చింతనా స్రవంతి 

 

ఔదార్యమే మతమన్న విలాసహాసపు ప్రకృతింట 

 

స్వార్దమే వేదమాయనేమి పాలనా సంస్కృతికి 

 

సహకారపు సొబగు, సారస్వతపు జిలుగు నెరుగని

 

వెలలేని బ్రతుకులు ఏపాటి విలువ సేయు?

 

యోచనతో ఆవిష్కరించవోయ్  నిన్నటి ఆ విలువలను

 

విమోచన మప్పుడేనోయ్  రేపటి నవతరానికి

 

 ********



Wednesday, June 3, 2015

హైకూలు

హైకూలు 

తలకట్టు, దీర్ఘమైతే 
పోయిన ప్రాణం 
తిరిగిరాదా? ఆ పూలజడలకి 
**************
ప్రకృతి అందాల వెనుక 
పరుగులెత్తే మనసులకి 
పట్టే స్వేదమేనోయ్ అమృతమంటే 
***************
ముందుకెళుతూ 
వెనుకకు చేర్చేది ఫ్యాషన్ 
వెనుకబడుతూ 
ముందుకు నడిపేది కల్చర్ 
****************
మనసు చేసే 
మౌనపు సేద్యానా 
కలుపు తప్పదోయే ఊహలుగా  
****************

Friday, April 24, 2015

అగాధం

అగాధం
అనుభూతికి హృదయానికి నడుమ 
మనిషికి మనిషికి ఏర్పడినంత 
అగాధమేర్పడిన్దిప్పుడు 
*************
హైవే 
రాలిన ఆకులే వాహనాలుగా 
హైవేను తలపిస్తుందా 
కోనలోని సెలయేరు 
*************
చక్రాలు 
యుగం మారి 
ధర్మానికి విరిగిన ఒక్కో కాలు 
చక్రాలై అమరాయా అధర్మానికి 
************
వెన్నెల 
మనసులనే కాదు 
చూపులను కూడా కొనలేనంత 
పేదదయ్యింది వెన్నెలిప్పుడు 





Monday, April 20, 2015

హైకూలు

హైకూలు 
పేజీల సౌభాగ్యం 
రాజీల దౌర్భాగ్యం 
పాపమా విలువలది 
***********
వాలుజడలకై 
వేచిన అభిసారికలు 
పూలజడలు 
************
చావుని 
పోషించడమే 
జీవితమంటే 
***********
ఆహా నుండి 
హవ్వా వరకు 
మన తెలుగో!మన తెలివో?


Thursday, April 16, 2015

హైకూలు

హైకూలు

సీమంతానికి పెద్ద ముత్తెదువ 
ఆ కోయిలమ్మ 
ప్రసవానికి మంత్రసాని 
ఈ నెమలమ్మ 
************
మనసుకి 
ఊహ జీతం 
స్వప్నం బోనస్ 
************
పూల తావిని కడుపార మేసి 
అరగడానికని
ఈ పైరు పాపలను ఊయలూపుతున్దీ గాలి 
************
రోడ్డుకొచ్చిన అల్సర్లే 
ఈ గోతులు