Monday, July 28, 2014

తస్మాత్ జాగ్రత్త

తస్మాత్ జాగ్రత్త 

ఎన్నాళ్ళైనా ఏడుద్దాం 
నిట్టూర్పులెన్నైనా విడుద్దాం 
పసిమొగ్గలపై మృత్యువు కక్కిన హాలాహలాన్ని 
దిగమింగ కాలాన్ని దొర్లిద్దాం 
వీడిది తప్పంటూ, వాడిది తప్పంటూ వాదులాడేద్దాం
చివరకు, నూరేళ్ల రాతనూ రాయలేని 
విధాతదే నేరమంటూ ముగిద్దాం 
ఎందుకంటే, ఘోరం జరిగాక మనకో నేరస్తుడు కావాలిగా అంతే!
ఆ! ఇక పదండి 
భారంగా మూలిగే మనసును 
మరల బ్రతుకు బగ్గీలో కూర్చోబెడదాం 
వద్దన్నా, దానిని అక్కడి నుండి లాక్కెళ్ళిపోదాం 
ఎందుకంటావేమిటోయ్
అక్కడ నీ మనసుకు మానవత అంటితే!
అందులోంచి ఆలోచన పుడితే! అది ఆచరణైతే!
అమ్మో మనిషనిపించేసుకుంటావేమో??
అందుకే తస్మాత్ జాగ్రత్త.
******

Saturday, July 19, 2014

ఊహ

ఊహ
కాలాన్ని దొర్లించి,
కలాన్ని కదిలించి!
తీపి గురుతుగానో, చేదు గుళికగానో!
మనసున మిగిలిపోదూ! ఊహ. 
****
బాష్పాభిషేకం
విచ్చుకున్న పూలైన వేళ ఆ పెదవులు!
తొలి మంచు బిందువుల తళుకద్దడానికి 
ఎంత తొందర పడుతున్నవో 
చూడా ఆనందబాష్పాలు. 
****
తల్లిదండ్రులు
మళ్ళీ మళ్ళీ పుట్టే నా మనసుకు 
ఆలోచన, అనుభవాలే 
తల్లిదండ్రులు. 
****
చెరపలేని దూరం
చిరునవ్వు చెరపలేని దూరాన్ని చూపమని 
నా మనసుని అడిగాను. 
ఎక్కడెక్కడ తిరిగిందో అది పాపం 
అలసి అలసి నన్ను చేరి 
నా కన్నా మిన్నగా నవ్వుకుంది. 
**** 

Thursday, July 10, 2014

మరుపు

మరుపు
పొంగే ఆ పాల నవ్వుల నురుగులను
చూసుకుంటూ! 
ఆ అల తనను కొట్టిన దెబ్బను మర్చిపోదూ
ఈ శిల. 
****
నీటిబొట్లు 
ఐకమత్యం లో అందముందో 
లేక విడిపోవడంలో అందముందోనని 
ఆ విధాత కూడా 
తమకింకా వివరించలేక పోయినందుకు కాదూ
కలిసినట్టే కలిసి విడిపోయేదా నీటిబొట్లు 
ఈ తామరాకుపై. 
*****
శిల్పం
మూగదై! తానాడలేని మాటలను 
నా మనసున పాటలుగా పలికిస్తూ 
ఒక్కతీరుగా తానెలా ఆడుతోందో 
చూడా శిల్పం. 
*****
తోరణాలు
స్పర్ధల తో 
నా మనసింటికి తోరణాలు కట్టినాను 
నన్ను నేను ఆహ్వానించుకోలేని ఆ ఇంటికి 
నిన్ను ఆహ్వానించుట ఎట్లో? నేస్తం. 
*****

Thursday, June 26, 2014

కొండంత మేడ

కొండంత మేడ
చిటికెన వేలంత పునాదిపై 
కొండంత మేడను 
ఎంత అందంగా కట్టిందో చూడు 
వెలిగే ఆ దీపం. 
****
మానవత 
ఏమి నిలబడి ఉంటుందోయ్ 
ఆ అద్దం ముందు 
అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో 
ఆ ఏముందిలే 
బహుశా! మానవతైయుంటుందేమోలే!
****
పేదరికం-ఆడంబరం
చిరిగి 
పేదరికాన్ని ఆడంబరాన్ని కూడా 
ప్రతిబింబించగలదు ఆ బట్ట. 
****
సంధ్య
బద్ధ శతృవులైన 
ఇద్దరు సమవుజ్జీల నడుమ 
అధికార మార్పిడిని 
ఎంత సులువుగా చేయగలదో చూడు 
ఆ సంధ్య. 
****

Friday, June 20, 2014

ప్రకృతిచిత్రం

అందాల విందు 
అడ్డం లాటి మనసు, ఆతిథ్యమీయాలన్న ఆశ 
ఈ రెండూ చాలవా? ఆకాశం కూడా మురిసి పోయేంత 
అందాల విందును 
ఆ నిండు జాబిలికి వడ్డించనేనంటూ 
చూడు ఎలా మిడిసిపడుతోందో 
అందాల ఈ పల్లె చెరువు. 
*****
ఆనందబాష్పమాల
ఎంత ఆనంద పడుతోందో ఈ కడలి 
తను రాల్చిన ఆనందబాష్పధారలు 
మాల అయి నీ మెడను మెరుస్తున్నందుకో చెలీ!
******
అందమైన అలజడి  
నాలుగు రాళ్ళను లోనికేసుకుంటూ 
అలజడిలో కూడా 
అందముందంటుందా చెరువు 
నిజమేనంటావా?
****
మధనం
మధనం అమృతంతో ఆగిపోయింది కదా!
అలానే అంతర్మధనం కూడా 
ఆనందబాష్పం తో ఆగిపోతే ఎంత బావుణ్ణు. 
******
శిల
మేనితో గానీ మనసుతో గానీ 
మీరు పలుకరించలేని శిలలాంటి మనుషులుంటారని 
తనపై రాలిన ప్రతి పూవుతోనూ 
అంటుందా శిల. 
******
  

Wednesday, June 18, 2014

గతజన్మ

గతజన్మ
గతజన్మలో 
నీలిమబ్బుల బారులు 
ఆ నదీపాయలు. 
***
భాగ్యవంతురాలు
అటూఇటూ 
పూలు కావలి కాచేంత
భాగ్యవంతురాలా దారం. 
****
మెరుపుసుందరి
చీకటిలోనూ 
ఆ మబ్బుల గుంపుల్లో దారిచేసుకుంటూ 
ఎక్కడికి పోతోందో 
ఆ మెరుపుసుందరి. 
****
యుక్తి
గెలిచేదాకా పోరాడే 
శక్తి ఐతే ఉంది గానీ 
ఎలా గెలవాలో అనే 
యుక్తి మాత్రం లేదా అల దగ్గర. 
****

Monday, June 16, 2014

అందం

అందం
 ఓ పక్క ఆ ఆకాశం 
తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా 
అందాన్ని ఎంతందంగా 
నెమరువేస్తోందో చూడా నది 
ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. 
*****
జలపాతం
దగ్గరకు పిలిచి 
అంత గంధం నా మేనంతా పూసి 
తన గాంధర్వాన్నంతా వినిపిస్తుంది 
నాకా జలపాతం. 
******
తలపు
పరుగెడుతున్న ఆ ఏటి చరణాలకు 
గజ్జె కడదామనుకున్న నా తలంపే 
నవ్వు నురుగులుగా పల్లవిస్తుంది అదిగో అలా.... 
******
దివాలా
కలలు పండించలేక 
నిదుర కూడా వ్యవసాయంలా 
దివాలా తీసిందోయ్. 
******