Monday, March 21, 2016

మినీ కవితలు

అన్వేషణ 
వెలుగుతూ 
ఆ చీకటి శిరస్సుకై 
వెదుకుతుంటే ఆ దీపం 
దాని కింద నలుగుతూ 
ఆ దీపపు చరణాలకై 
అన్వేషిస్తుందా చీకటి.
*******
ఆణిముత్యాలు 
పడినా ,లేచినా 
ఆగక నవ్వే ఆ కడలి అంతరంగంలో 
ఆణిముత్యాలు కాక ఇంకేమిటుంటాయోయ్.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

Sunday, March 13, 2016

మినీ కవితలు


ఆడది 
అణచుకోవడం చేతకాక బ్రద్దలై 
అది విశ్వమైంది గానీ 
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ 
ఆడదే అయ్యేదేమో.
******
 సన్మానం 
చేసిన సేవను మరువలేక కాబోలు 
కొమ్మ కొమ్మ ఆపి మరీ 
సన్మానిస్తోంది 
 ఆ రాలుతున్న పండుటాకును.
*******
పూల చరిత్ర 
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని 
గ్రంథస్థం చేస్తున్నాయి 
ఈ తేనెటీగలు.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.


**********

Saturday, March 12, 2016

మినీ కవితలు

అద్దం 
కదలకుండా నిలబెట్టి
నన్ను నిలువుదోపిడి చేస్తూనే!
తనపై నవ్వుల పూలు వేయించుకునే
కళనెక్కడ నేర్చిందో ఈ అద్దం. 

గుప్పెడంత చేను

ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎప్పుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది 
నా మనసు
ముక్కుపుడక 
తావిని మోయలేకా గాలికి పట్టిన 
స్వేదబిందువొకటి జారి 
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది  అదిగో అలా .... 
*******

Sunday, March 6, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

నా చేతుల్ని 

ముద్దాడడానికని 

మిణుగురుల అవతారం 

ఎత్తింది ఆ జాబిలి

************

నా మనసులోనే నిన్నెక్కడో దాచి 

దాగుడుమూతలు ఆడుతూ 

నిన్ను కనిపెట్టే ఆటకు 

విరహమని పేరు! ఓ నా చెలి 

***********

ఆ బురద మట్టిలో పడి 

మాట్లాడే మొక్కలుగా మొలిస్తే 

ఎంత బావుణ్ణు! మన నీడలు 

**********





Thursday, January 28, 2016

మీ వెర్రిగాని

మీ వెర్రిగాని 

ప్రశ్నలు అడిగితే,

చెప్పలేక దిక్కులు చూస్తున్నాడా?

స్పెల్లింగ్గులు రాయమంటే 

అన్నీ తప్పులే రాస్తున్నాడా?

ఇంక వీడికి చదువేమబ్బుతుంది 

ఉద్యోగమెలా వస్తుందని అనకండి. 

ఏమో దిక్కులు చూసే వీడే 

రేపు వాస్తు సిద్దాంతి అవుతాడేమో!

స్పెల్లింగ్గులు తప్పులు రాసే వీడే 

రేపు న్యుమరాలజిస్టు అవుతాడేమో!

ఆ! కాలం మారిందండి బాబు. 

రంగు రాళ్ళు, వాస్తు గూళ్ళు  

రూపాంతర నామాలు, సహస్ర దీపాలు 

వేటికవే అదృష్టాన్ని అన్లిమిటెడ్ గా పంచుతూ ఉంటే 

అక్షరం ముక్కబ్బనోడికి  కొలువును 

ఆ చదువుల తల్లే చూపాలా? మీ వెర్రిగాని!

 

Wednesday, January 27, 2016

మినీకవితలు

మినీకవితలు 

తాత 

తండ్రి 

మనవడు

ఓ అనురాగపు టింటి కప్పు 

వృద్ధాశ్రమం 

ఆఫీసు 

కార్పోరేట్ హాస్టలు

ఆ అనురాగపు చావు డప్పు 

***************

ఎవడి ప్రపంచాన్ని 

వాడికిచ్చే సాంకేతికత ముందు, 

అందరిదీ ఈ ప్రపంచమన్న

నాగరికత నిలుస్తుందా? చెప్పు 

***********

అదృష్టానికి మార్గదర్శులటోయ్  

పేర్లలో అక్షరాలూ 

ఊర్లలో దేవుళ్ళు 

 

 


Monday, January 25, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

నీ పరిచయం, ఏమి మిగిల్చింది నాకు? 

నాలో లేని నన్ను తప్ప! 

నీ అజ్ఞాతం ఏమి మిగిల్చింది నాకు? 

నీకై  వెతికే నన్నుతప్ప!

************

ప్రకృతికి, నా ప్రేయసికి 

ఒకటే పోలిక.  

ఆస్వాదించే మనసుతో నేనుంటే 

అంతులేని అనుభూతులతో వారుంటారు 

**************

పువ్వు  మొగ్గవుతుంది 

రేపయినా నా చెలి సిగలో 

నవ్వొచ్చని 

************

మనసుప్పొంగిందని 

చెబుతుంది ఆ  నీటి బొట్టు 

బుడగేసి 

*******