Thursday, April 16, 2015

హైకూలు

హైకూలు

సీమంతానికి పెద్ద ముత్తెదువ 
ఆ కోయిలమ్మ 
ప్రసవానికి మంత్రసాని 
ఈ నెమలమ్మ 
************
మనసుకి 
ఊహ జీతం 
స్వప్నం బోనస్ 
************
పూల తావిని కడుపార మేసి 
అరగడానికని
ఈ పైరు పాపలను ఊయలూపుతున్దీ గాలి 
************
రోడ్డుకొచ్చిన అల్సర్లే 
ఈ గోతులు 




Sunday, April 12, 2015

పక్షి గూళ్ళు

పక్షి గూళ్ళు 

అన్ని పూలతో విరిసిన, ఆ మాను సిగలో
కిలకిలా నవ్వే పూలై, ఎలా అమరాయో 
చూడా పక్షి గూళ్ళు 
**********

మెరుపు తీగ 

ఏ తీగా రాల్చలేనన్ని పూలను 
తను రాల్చగలనని కాబోలు 
ఉరిమేంత గర్వముందా మెరుపు తీగకి 
***********
సాలీడు 
తన ఇంటి మాటు నుండి చూస్తూ 
నిండు చంద్రునికో నూరు నూలు పోగులేసే 
కిటుకు నేర్చుకోమంటుందేమిటోయ్ ఆ సాలీడు  





Wednesday, April 8, 2015

తెర

                          తెర 

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని 
బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను. 
సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న 
ఉద్వేగోన్మాదివి నువ్వు. 
ప్రేమలను విరబూయిస్తావు,
పగలే పరమార్ధమంటావు, 
రాని వయసులను రప్పించేలా నిన్ను నీవు అలంకరించుకుంటావు.  
అవును!
వర్ణశోభ, కర్ణక్షోభ తప్ప ఏమున్నాయి నీదగ్గరిప్పుడు? 
అనురాగాలను అనంత లోకాలకంపేసావు,
హితం లేని సాహిత్యాన్ని 
ఇంగితం లేని సంగీతాన్ని ఎక్కు పెట్టి ,
విలువలపై 70MM బట్ట కప్పి 
సాని బాట పట్టేవు, కసి కేళీ చూపేవు 
తెరవు, కల్ప తరువువు అనుకున్న 
ఎoదరి కళ్ళకో అడ్డు తెరగా నిలిచేవు 

Monday, April 6, 2015

క్రోధం-మోదం

క్రోధం-మోదం 

మనసు నుండి ఎప్పటి 
మకరందాన్ని అప్పుడే 
తాగేసే భ్రమరమా క్రోధం  
కూడబెట్టే మధుపమా మోదం
************

పూలు

మూగ సైగలే తప్ప 
మాట్లాడడం రాని 
బహు భాషావేత్తలీ పూలు 
*************
అత్తరులు 
పరిగెడుతున్న ఈ సమాజంలో 
ఆ అనురాగాలకన్నా 
ఎక్కువ ఆయువునే 
పొసుకుంటున్నాయి అత్తరులు 
*************


Friday, April 3, 2015

గోదారి

గోదారి 

తన విభునకేమి తక్కువంటూ 
పుట్టింటి నుండి పట్టుకెళ్ళాసిన 
చీర సారేలను మనకు జీవితాలుగా 
వదిలేస్తుందా గోదారి 
*************

నింగి నేతగాడు 

తన సిగ్గుతో, మేఘాల మేని పై 
బంగరు బట్టను నేసి 
మన చూపుల గిట్టుబాటoదక 
మదనపడే నింగి నేతగాడా నిండు జాబిలి
************** 

కోవెలలో 

అనుభూతి ప్రసాదం 
తీర్ధమా ఆనంద భాష్పం 
ఈ ప్రకృతి కోవెలలో 


Saturday, March 28, 2015

మనిషి

మనిషి 


ఉండాల్సిన సుగుణాలన్నీ 
ఉన్నట్టుగా కనిపించే
ఎoడ మావి పేరే మనిషి 
*************

తాటికాయలు 

నా దేశ సంస్కృతి పై 
పడుతున్న తాటికాయలు 
ఈ వారాంతాలు 
*************

ఎoదుకో?

నాడు గంగలా పొంగిన సారస్వతం 
నేడు సరస్వతిలా అయిoదెoదుకో 
ఈ సినిమా పాటల్లో 
**************

మహాత్మా 

నోటితో వద్దన్న పనులన్నిటినీ 
నోటుతో చేయించడం నీకే చెల్లింది 
ఓ మహాత్మా 




Monday, March 23, 2015

హైకూలు

హైకూలు
**************

ఆకాశాన్ని దీవిస్తూ 

అక్షతలు  విడిచిందా  పంట చేను 
 
పక్షి  గుంపులుగా 
***********

కృష్ణుడే వచ్చి 

కుచేలునికి మూడు గుప్పిల్లిచ్చి

అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే 

రాజకీయమంటే

***********

నలుగురితో సంఘర్షించిన వేళ 

చరిత్ర లోకి నేను నడిచాను 

నాతో నేను సంఘర్షించిన వేళ 

తనుగా వచ్చి నాతో నడచిందా 

చరిత్ర

**********

అడవిని వదిలామని 

అందరూ నమ్మడానికి 

ఇంకెంతగా మారాలో కొందరు