Friday, March 6, 2015

ఆగని కన్నీరుగా

ఆగని కన్నీరుగా 

ఆకాశం కూడా
నా మనసులానే
మబ్బులతో డాగులు పడింది
పెద్ద వర్షం రావలసిందే
ఆగని కన్నీరులా

****

సతీ సహగమనం

సతీ సహగమనమంటే
ఎమిటని ఆ కలువ కమలాల కన్నా
మిన్నగ చెప్పగలవారేవ్వరోయే!
****

పిసినారి సంద్రం 

అంత చోటు తనకున్నా
నా కాళ్ళ  కింది చోటును కూడా
ఎలా కరిగించుకుని పోతుందో చూడా సంద్రం
****

మిడిసిపాటు

మెరిసిపడే  వెన్నెలకు 
మిడిసిపడడం నేర్పింది 
మా పల్లె చెరువు 

 




 

Wednesday, March 4, 2015

బదులు 

వయ్యారముప్పొంగే పరువంపు వేళ
ఆ దరి కెన్ని ముద్దులిడినావని
ఎడబాసిన వేళ ఈ గోదారి నడిగితే
తిన్నెలుగా పరుచుకున్న
ఈ ఇసుక రేణువు లన్ని,అని
ఎంత అందంగా బదులిచ్చిందో చూడు

పేరంటాళ్ళు 

పగలూ రాత్రీ ఎప్పుడూ
ఎవేవో పిలుపులతో
ఇన్నిన్ని పేరంటాళ్ళను
ఎలా జరిపిస్తుందీ వనమని
ఆ చిటారు కొమ్మనో ఈ చిన్ని మొగ్గనో
అడిగావా ఎపుడైనా నువ్వు?

మెరుపు

నింగి తోపున పూచిన 
పూలా మబ్బులను కూర్చి 
మాల కడదామనుకున్న నా తలపుకు 
చిక్కెనుగా మెరుపు దారమై  

Wednesday, December 17, 2014

ఉగ్రవాదం

ఉగ్రవాదం

ఇంకెన్ని కన్న పేగులను!
మెలిపెట్టి మోపుగా పేని బంధించాలో!
మదపుటేనుగంటి ఉగ్రవాదాన్ని. 

*****

గాయాలకు పుట్టడం తెలుసు. 
ఘోరాలకు చావడం తెలీదని 
తరగతి గదులన్నిటి పై రాయాలని ఉందిప్పుడు. 

*****

పూవుల్లాంటి పిల్లల దేహాలపై!
పూలై రాలుతూ ఆ పుస్తకాలు పడిన నరక యాతనను వర్ణించ 
ఎన్ని గ్రంధాలు రాయాలో అని 
అంటున్నాయా తరగతి గదులు. 
*****


మనిషిగా మారమని చెప్పాలా మృతదేహాలు 
అవీ మొగ్గలవి. 
*****



బాంబులు, గుళ్ళనే పొరలను తవ్వుతూ 
మనిషన్న వాడి ఆనవాళ్ళను కనిపెట్టాల్సి వస్తుందేమో 
ఆ దేవునికైనా. 

******

Wednesday, December 3, 2014

వింత సృష్టి

వింత సృష్టి 

మనసులేని విజ్ఞానం 
నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి 
ఓ వింత సృష్టి చేయమందట 
కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లే 
ఇకపై పుట్టే ప్రతి శిశువు 
లాప్టాపులతో బుక్స్ బాగులతో పుట్టాలని 
క్యార్ క్యార్ మనకుండా సర్ మేడం అనాలని 
ప్రయత్నిస్తామన్నారట విజ్ఞత లేని విజ్ఞానులు 
కాదు సాధించి తీరాల్సిందేనందట సమాజం 
వేలెత్తి చూపడం మాని ముక్కున వేలేసుకుందట మేథావితనం. 

*******

Tuesday, November 18, 2014

పూబోణి

పూబోణి
 
 
రాతి గుండె కరిగించి, రాగమాలికాలాపించి, 
 
ఒంపులు తిరిగే ఒయ్యారాన పచ్చలారబోసి
 
నేలమ్మ నుదుటిన సిరిరాత రాసే పూబోణి అని 
 
ఆ గోదారిననిపించాలని  ఎన్ని నురుగులో ఆ మేనుపై. 
 
 
*****
 
కంటెరుపు 
 
 
మింటి కంటెరుపు కిలకిలా రావాలు పలికిస్తుంటే,
 
నాలుగు గోడల నడుమే మూగవైపోతున్నవెందుకు?
 
ఇంతి కంటెరుపు గీతాలు. 
 
*****
 
 
జిలుగులు 
 
 
పడుగు పేకలు పారిజాతాలై విచ్చినా 
 
ఆకలి అప్పులు సహజాతాలై గ్రుచ్చె 
 
తరాల దృశ్య మాలికలో జిలుగులందరివి. 
 
చిరుగులే వారివి. 
 
 
*****
 
నాలుగు రాళ్ళు 
 
 
కుదురుగా ఉన్న జీవితాన 
 
నాలుగు రాళ్ళేసి అందం తేగలవా?
 
ఎందుకు తేలేవోయ్ 
 
మా ఊరి చెరువులో ఒకమారు అలా చెయ్. 
 
అలల  పై ఆడే నీ మనసుని ఆపనెవ్వరి తరమని 
 
అడగవా మరి నీవే. 
 
******


Monday, September 22, 2014

సున్నాలు - శూన్యాలు

సున్నాలు - శూన్యాలు 
 
 
సున్నాలతో ఎదిగేది 
జీతం. 
శూన్యాలతో నిండేది 
జీవితం. 
 
 
***
 
వెన్నెల విల్లు 
 
చూపుల విరాళమిచ్చిన! నాకు 
వెన్నెల విల్లు రాసిచ్చింది 
ఆ జాబిలి. 
 
 
***
 
 
ఇంట.... రచ్చ.... 
 
విభజించి పాలిస్తూ రచ్చ గెలిచి 
కలిసుంటే కలదు సుఖమంటూ ఇంటా గెలిచి 
రెండిటా చరిత్రకెక్కిన ఘనతనే సాధించిందిగా 
రవి అస్తమించని ఆ రాజ్యం. 
 
***
 
పాపం - పుణ్యం 
 
పాపానికి పల్లకీని 
పుణ్యానికి పాడెని 
ఏక కాలంలో భుజాలపై మోసే 
బోయీలెందరో ఈ కాలాన. 
 
***
 
 


Monday, September 15, 2014

నేను

నేను
 
 
నువ్వా? అనే ముళ్ళు 
 
రేకరేక నూ గ్రుచ్చుతున్నా!
 
నేనే మనిషినంటూ విరబూసిన
 
అందమైన అబద్ధమే నేను. 
 
 
****
 
 
రంగవల్లిక
 
అన్ని చుక్కలను కలపాలా,
 
రచించేందుకా రంగవల్లికనంటూ 
 
చటుక్కున చిన్ని రాయిని మింగిందేమిటా తటాకం. 
 
 
****
 
 
అభినందన
 
క్షణంలో! నదీ పాయల సౌందర్యాన్ని 
 
విహంగ వీక్షణాన వినువీధుల వెలయించిన
 
ఆ మెరుపు తీగను 
 
నా రెప్పల కరతాళ  ధ్వనితో అభినందించాను. 
 
 
****
 
 
మూఢనమ్మకాలు 
 
వెలిగే దీపం తన క్రింది చీకటిని పోగొట్టలేనట్లే,
 
వెల్లువైన విజ్ఞానంలో కూడా పల్లవిస్తూనే ఉన్నాయి!
 
మూఢనమ్మకాలు. 
 
****