Wednesday, June 4, 2014

వెలుగుల చీకట్లు

వెలుగుల చీకట్లు
నా దేశాన సంస్కృతనే గర్భాలయాన 
రంగురంగు దీపాలే!
ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు!
ఆ పబ్బుల పుణ్యమా అంటూ. 
****
వెచ్చని స్వప్నాలు
మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే 
ఆ కొండల మనస్సుల్లో 
వెచ్చని స్వప్నాలుగా ఎన్ని మొలకలో!
*****
వ్యభిచారం 
సానికి కూటికై,
నేతకు సీటుకై. 
అక్కడ దానితో ఒక్కడికైనా సుఖముంది 
ఇక్కడ వీడితో ఎవ్వరికైనా ఉందా .... సుఖం. 
*****

Sunday, May 25, 2014

విశ్వ పరిణామం

విశ్వ పరిణామం
అణువు నుండి తానెలా పరిణమించానో అని 
తెలుసుకోవాలంటే ఈ విశ్వం 
నాలోని నీ పరిచయం నుండి 
ప్రస్తుతాన్ని పరీక్షిస్తే సరి. 
****
సంస్కృతి
వ్యసనాలకు వయసు తగ్గిన చోట 
తాను మాత్రమూ ఆయువెక్కువ పోసుకోగలదా?
సంస్కృతన్నది. 
****
వెన్నెల రాజు
నిండు మనసుతో వచ్చినా?
నీ మనసుతో ఒక నిముషమైనా 
మన్నన పొందగలుగుతున్నదా?
ఆ వెలలేని నెలరాజు ఈ మధ్యన!
 *****
చినుకులు 
అమ్మ ఒడి నుండి జారి!
అప్పుడే అనంత ప్రయాణం చేసిన తనకు 
బడలిక తీర్చుకొమ్మంటూ పీటేసి,
వసించమంటూ తన పాదాల 
ఇంత చోటు చూపిన మొక్కపై
పూవులై, ఎలా నవ్వులు కురిపిస్తున్నాయో చూడు 
నాటి చినుకులు. 
*****

Thursday, May 22, 2014

వాచకాలు

వాచకాలు
వాచకాలు వాచిపోతూనే ఉన్నా 
విలువలకై ముఖం వాచిపోయేలా 
ఎదురు చూస్తుందేమిటో 
ఈ సమాజం. 
****
పల్లె చెరువులు
అదే పనిగా సాగిపోతున్న మబ్బులను 
తమ అందం చుసుకోమంటూ 
ఎంత అందంగా ఆపాయో చూడు!
అద్దాలై ఆ పల్లె చెరువులు. 
*****
ఎండమావులు
నాగరికత పై 
పరుచుకున్న ఎండమావులే!
వికాసాలన్నవి. 
*****
రుచి
కథల రుచి 
బాల్యానికి తెలీడం లేదు 
అందుకే బ్రతుకు రుచి 
జీవితానికి......... 
*******

Sunday, March 16, 2014

పున్నమి

పున్నమి 
పున్నమి, దీపాన్ని పట్టుకుని 
గోదారి గట్ల వెంట వెతికేది ఏమై ఉంటుందంటావ్?
తెలీదంటావేమిటోయ్ నీ మనసే 
పాపమోసారి దొరకనివ్వవోయ్ దానికి. 
******
ఫాషన్
అందాలన్నిటికీ 
అందమైన వలువలు కడుతుందా చీకటి 
ఫాషన్ అంటే ఏమిటో తెలీకుండానే 
*****
జోడెడ్లు
జోడెడ్లే మనిషి, మనసు 
కానీ రెండూ 
ఒకే తోవన నడవడమే అరుదు. 
******
మనసు
ఉన్న చోటెక్కడో చెప్పదు కానీ 
విషాదమైనా ఆనందమైనా 
తనువంతా కదిపి పారేస్తుంది 
నా మనసు. 
******

Saturday, March 15, 2014

దీపం

దీపం
గాయం లేదు 
చుక్క రక్తమైనా చిందలేదు 
అయినా ఎంత కాంతులీను బిడ్డను కందా దీపం. 
*******
సరస కావ్యం 
ఓ కవి భావుకతలాటి ఆ చల్లగాలికి 
ఓ నర్తకిలా ఆ వనం అభినయం నేర్పితే 
ఆడుతున్న ఆ సరసకావ్యాన 
నాయికా నాయకులెవరో తెలుసా? 
నీ కన్నులే. 
******
పెరటి పువ్వు
ఎంత పిలిచినా పలుకలేదని 
అలసి నా పాదాల పై పడి 
ప్రాణాలొదిలింది నా పెరటి పువ్వు 
******
శాపం
ఏళ్ళుగా నిలబడి 
తపస్సు చేసినందుకు 
శాపం మీదపడిందని 
ముక్కలై పోతోందీ మాను. 
******

Wednesday, March 5, 2014

సుందరి

సుందరి
తాను వస్తూనే నా జీవితాన్ని 
అందంగా అలంకరించింది 
తన ఎదుటనుండి నన్నో క్షణం దూరం కానీయనంత దగ్గరైంది 
నాక్కావాల్సిన రూపంలో తానాడింది 
ఆమె లేనిదే జీవితమే లేదనిపించింది 
ఇంత చ చేసిన ఆమెను నీకేమి కావాలంటూ అడిగితే 
నీ ప్రాణాలు నాకిమ్మంటూ అడిగిందా ప్లాస్టిక్ సుందరి 
******
 నాట్యం
నేలపై నీ కళ్ళను పరచి 
చెట్టు విడిచిన ఎండుటాకు
గాలిలో చేసే నాట్యాన్ని 
నీవెప్పుడైనా చూశావా 
ఆకాశ సంద్రం నుండి బయలుదేరి 
నేల తీరాన్ని చేరే నావలా లేదూ!
******
శిల
రాయికి మాత్రం తెలిసిందా 
నిన్ను ఆకట్టే కళ తనలో ఉందని 
నే తనను శిల్పంలా మలచేదాకా. 
నాకు మాత్రం తెలిసిందా 
శిలలా నేనున్నానని 
నీ చూపు నాపై పడేదాకా. 
*******
అలక
నిజం చెప్పాలంటే 
వాడంత కొంటెతనం నీకెక్కడిది 
ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ 
నిలబడి నీవు ప్రేమాయణం సాగిస్తే 
వాడేమో ఓరకంట ఆ వయ్యారాన్ని మీటి 
తన దారిన తాను పోతూ 
చెలిని చుట్టూ తిప్పుకుంటాదంటూ 
సూరీని చూపి ఆకాశం తనను దెప్పిందని అలిగి 
అమాసన బయటకే రాడు జాబిలి. 
*******

Tuesday, March 4, 2014

గుప్పెడు చేను

గుప్పెడు చేను
ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎప్పుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది 
నా మనసు. 
*****
సజీవగీతికలు
మమతానురాగాలు 
పల్లవీ చరణాలుగా వినిపించే సజీవగీతికలను విని 
ఎంత కాలమైందో అని 
తనలో తాను అనుకుంటూ 
ముందుకు సాగుతుందీ కాలం. 
******
బడాయి
ఎక్కడ నా రెక్క తగిలి 
తను గాయపడాల్సి వస్తుందోనని 
అంత దూరానెళ్ళి కూర్చుందా ఆకాశమంటూ 
ఎంత బడాయిగా చెబుతోందో 
చూడా బుల్లిపిట్ట. 
*****
మెరుపుతీగ
తానాడే ఆటకు నిడివి చాలకనో 
తకిచ్చిన ఆయువు ఇంతేనా అనో 
అలిగి ఆ ఆకాశాన్ని వీడిన 
మెరుపుతీగ కాదటోయ్ 
వెన్నెల్లో ఈ గోదారి. 
*******