Sunday, March 2, 2014
Friday, February 21, 2014
వలపు పేరంటం
వలపు పేరంటం
నా ఏకాంతాన్ని పంచుకుంటూ
ఆ వెన్నెల ఇంకా ఇంకా వెలిగిపోతుంటే,
వలపు పేరంటపు తోరణాన్ని
ఎంతందంగా కట్టిందో చూడా కలువ
నా కనుదోయి వాకిట.
*****
ఆధునిక కాపురాలు
అయితే నిశ్శబ్దం లేదా రాద్ధాంతం అనే
రెండు సేతువులే అనుసంధానిస్తున్నాయి
కొన్ని ఆధునిక కాపురాలనీమధ్యన
******
ఆధునిక అందాలు
ఆభరణాలను, ఆచ్చాదనలను వదిలేసి
నిగ్రహాలు, గౌరవాలు కావాలంటున్నాయి
ఆధునిక అందాలు కొన్ని
******
మౌనరాగాలు
పొదల ఎదలలో దాగిన
మౌనరాగాలను తన గొంతుతో
ఎంత చక్కగా ఆలపిస్తుందా గాలి.
******
Wednesday, February 19, 2014
రాచపీనుగ
రాచపీనుగ
రాచపీనుగ ఆ సాంప్రదాయం
అందుకే గౌరవమర్యాదలు
దానికి తోడుగా అలా......
*****
మధురగానం
మనసు కరిగించే మధురగానాన్ని
వినిపించబోతోందా ఆకాశమని కాబోలు
ఒళ్లంతా చెవులు చేసుకుందా బీడు.
*****
కన్నీళ్లు
ఎందుకని చెప్పలేక అవి మూగవై
అర్ధం చేసుకోవడంలో
అంధత్వాన్ని ఆపాదిస్తున్నాయి
నా మనసుకు ఆ కన్నీళ్లు.
******
పచ్చల తాంబూలం
పుడమికి పచ్చల తాంబూలమీయడానికి
మేఘాల తలపాగా చుట్టుకుని
ఎలా పెద్దమనిషిలా నిలబడిందో
చూడా కొండ .
******
Tuesday, February 18, 2014
Monday, February 17, 2014
ఓ చెలీ...
ఊహల
పుష్పకం కాదా! విరహమంటే
ఓ చెలీ....!
*******
నాపై కురిసిన నీ కరుణ వర్షం
సశ్య గీతమై! నన్ను రవళిస్తుంది
ఓ చెలీ....!
******
ఈ ప్రకృతి లోని అణువణువులో నిన్ను చూడడం, నాకు
నా మనసులోని అణువణువులోను నిన్ను వెతకడం,
ఆ ప్రకృతికి
వెన్నతో పెట్టిన విద్యలే ఓ చెలీ...!
******
కలసిన మన మనసులు
అనుభూతుల సారస్వతాన్ని రచిస్తున్నా!
కలసినప్పుడల్లా ఓనమాలే దిద్దుతుంటాయేమిటో!
మన కన్నులు ఓ చెలీ....!
******
Monday, February 3, 2014
మెతుకు
మెతుకు
పేగుకు మెతుకును
దగ్గర చేయడానికి
ఎంతెంత దూరమౌతున్నారు
ఈ మనుషులు
*****
కాలం మాన్పని గాయం
కాలం మాత్రం లోకపు గాయాలను
మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన !
గీత ప్రక్కన పెద్దగీతను గీస్తోంది తప్ప
******
పబ్బులు
గబ్బిలాలు, గుడ్లగూబలే
గడియారాలోయ్!
ఆ పబ్బుల్లో
******
భోగం
ఎంతభోగమో
నీడకి!
నేలే బోయీ అయింది
*****
Friday, January 31, 2014
కథలెక్కడ?
కథలెక్కడ?
కంచికెళుతూ! మంచిని పంచిన
నాటి కథలెక్కడోయ్ నేడు?
చూడు చూడు.. ఆ విలువలు చేరిన చోటకే
చేరిపోయాయా ఏమిటి?
*****
కలల మధువు
పూలై విచ్చిన ఊహల నుండి,
కలలనే! మధువును గ్రోలుతుంది నిదుర
తుమ్మెదై
******
దర్పణం
నన్ను కాసింత నవ్వించి,
నా కన్నులాస్వాదించే
మెరుపును కన్నదా దర్పణం.
******
ఆనంద బాష్పాలు
ఊరు ఊరంతా కొత్తబట్ట
కట్టబెట్టింది ఆ పొగమంచని
ఎన్నెన్ని ఆనంద బాష్పాలను రాల్చుతున్నాయో
చూడా ఆకులు ఈ పూరేకులు
*******
Subscribe to:
Posts (Atom)
