Sunday, March 25, 2012

VASANTHAM

చూసే కళ్ళను
కాపలాగా పెట్టుకుని
కొమ్మ కొమ్మన ఊయల కట్టుకుని
నిద్రిస్తుందా వసంతం.
       *******
ఎక్కడెక్కడో
నిన్ను వెదికే నాకు
అందాల నా విశ్వమంతా
నిండేవు నీవు.
     *******
నా ఏకాంతాన్ని చూసి
జాబిలి మబ్బు చాటైతే
కలువ ఏకాంతాన్ని చూసి
ఆ మబ్బు కాస్తా కరిగి
నీపై నా సందేశాన్ని కురిపించింది.
            ********

Wednesday, March 21, 2012

KAVITHALU

నీ వెనుక రావడమొక్కటి నేర్పి
నా మనసును
అన్నింటా ముందుంచడం
నీకే చెల్లింది.
      ******
ఈ అనంత ప్రకృతి
నన్ను వరిస్తూ
ప్రేమలేఖ రాస్తే
ముగింపులో నీ చేవ్రాలుకై
ఎదురుచూస్తుంది నా మనసు.
     ********
ఇన్ని సొగసులు తనలో ఉన్నా
నా దృష్టిలో ప్రకృతికి
నీ వెనుక స్థానమే
ఎందుకంటే నీ కన్నా
నన్నెక్కువగా ప్రేమించడం దానికి
చేతగాదు కనుక.
       *******

Tuesday, March 20, 2012

KAVITHALU

దించిన తల ఎత్తే లోపు
చెరువులో స్నానమాడి
గాలి వీపెక్కి
ఆకాశం లోకి పోయిందా మేఘం.
        *******
కాబోయే వాడు
చేతులు చాచి పిలుస్తున్నాడన్న
తొందరలో కూడా
చూడెంత ఒయ్యారంగా
పరుగెడుతోందో ఆ గోదారి
కంగారు పడినా
అంత అందంగా ఉండాలి మరి.
       ********
అన్నిటి కన్నా
అందమైన జంట
ఈ ప్రకృతి నా కవిత.
    *******

Monday, March 19, 2012

KAVITHALU

అంతులేని అనుభవాలను
నాకందించడంలో
ఆ ప్రకృతికి
నా ప్రియురాలే సాటి.
     *******
తన రహస్యాలను తెలుసుకోమంటూ
ప్రకృతి నా ముందు పరచుకుంటే
నీవు మాత్రం రహస్యంగా
నన్ను నీలో దాచి
నా ప్రకృతివైనావు.
     *******
ప్రకృతికీ నా ప్రేయసికీ
ఒకటే పోలిక
ఆస్వాదించే మనసు నాకుంటే
అంతు లేని అనుభవాలతో వారుంటారు.
      ********

Friday, March 16, 2012

KAVITHALU

నీ కన్నులు చూస్తూ
కవితలు వేయి రాయగలను
నీ పలుకులు వింటూ
పాటలు వేయి పాడగలను
కానీ అదేమిటో అవన్నీ
నన్ను పిలిచే నీ పిలుపు కన్నా
మధురంగా లేవు.
          ******
నా హృదయ స్పందనలను
నీ కనురెప్పలు
నిశ్శబ్దంగా పాలిస్తున్నాయి
వేయి వేల వరాల జల్లులా
నా పై అవి కురుస్తుంటే
లోకం నివ్వెర పోతోంది.
       *******
కడలిలా నేను చేతులు చాస్తే
తను గోదారిలా సాగింది
నీలి మబ్బునై నే నవ్వితే
మెరుపులా తను నన్ను తాకింది
ఆశై నేను జీవిస్తే
శ్వాసై తను నన్ను చేరింది.
      *******

Thursday, March 15, 2012

KAVITHALU


గూడు విడిచి
ఎగిరిందో గువ్వ
అందరు చూస్తుండగానే
ఆకాశం వైపుకు పోయింది
ఎందఱో ఆవేదనతో పిలిచారు
దిగిరాలేదు
ఎప్పటికైనా దిగొస్తుందిలే అనుకున్నారు
కాని పైపైకి పోవడమే తన నైజమంటూ
చుక్కల్లో కలిసి
ముడిపడే బ్రతుకులకు
పుస్తెలు కొనే తాహతు లేని వాళ్ళుగా
మమ్ము నిలబెట్టింది.
          *****
అక్కడో అందమైన చిత్రం
చూడడానికి ఇంకొన్ని కళ్ళుంటే
బాగుండనిపించేలా
చూస్తుండగానే ఆనంద భాష్పాలెన్నో
అలా రాలిన భాష్పాలతోనే
ఆ చిత్రమిప్పుడు పలుచబడిందేమో
రెండు కళ్ళు విప్పార్చి చూసినా
నాటి అందం ఇసుమంత కూడా
లేకుండా పోయింది
కనీసం ఆనవాళ్ళు చూపడానికైనా
ఏడాది గడువడిగిందా చేలు.
            *******

Wednesday, March 14, 2012

KAVITHALU

సూది లోకి దారంలా
ఎంత ఒద్దికగా దూరుతోందో
చూడు నా కిటికీకున్న
రంధ్రం నుండి ఈ సూర్యకిరణం.
      ******
ఒంటి నిండా తాను కట్టిన
బట్ట నిండా చిల్లులు పడితే
పొత్తిళ్ళ లోని బిడ్డను
ఎండ కంట పడకుండా
ఎలా దాచాలంటూ
మదన పడుతున్న తల్లిలా
ఉందా ఒజోనే పొర
       ******
గొట్టాల పోగంతా
ఆకాశంలో ఎంత చక్కని
ఆకారంలా అమరిందో చూడు
అచ్చం మానవ అస్థిపంజరంలా.
        *******