Sunday, March 11, 2012

KAVITHALU

         శిల్పం
ఎన్నాళ్ళ కాఠిన్యమో
వదలిపోయిందని
ప్రతీ క్షణం అదే తీరుగా
నాట్యమాడుతూ ఆ శిల్పం
నా కంటికి నిశ్చలంగా కన్పిస్తోంది.
        ********
ఎక్కడ వాటిని చూస్తూ
విరియడం ఆగిపోతాయో ఈ మొగ్గలని
వాడిన పూల జ్ఞాపకాలను
తుడిచేసుకుంటుందా చెట్టు.
         *******
    













Saturday, March 10, 2012

KAVITHA

      ఎవరివో  
ఏ ఆమని పిలుపులతో
చిగురించిన తొలకరివో

ఏ వెన్నెల వలపులతో
విరబూసిన కలువవో
నా కన్నుల చూపులలో
నటనమాడు కోమలివో
ఎవరివో నీవెవరివో?

దివి చూడని అందానివో
కవి రాయని పాటవో
గాలి పాడని లాలివో
భువిని లేని సొగసువో
ఎవరివో నీవెవరివో ?

ఏ చిరుగాలి పల్లకిలో
విహరించే సుగంధానివో
ఏ పచ్చని తోటలో
విరబూసిన కుసుమానివో
ఏ వెన్నెల రాతిరిలో
నే రాసిన వలపుల కవితవో
ఎవరివో నీవెవరివో?

లిపి నేర్చిన చూపువో
వలపు నేర్పిన చెలివో
కలవో మెరుపు మేఖలవో
సరస కావ్యానివో
ఎవరివో నీవెవరివో ?
        ********

Friday, March 9, 2012

AAMAY

       ఆమె
అన్నింటా
 ఆమె సగమే కానీ
కన్నీటిలో మాత్రం
ఆమెకెందుకో అంత
స్వార్ధం.
      *****
తన ఆనందాన్ని
మనకు పంచి
మన కన్నీళ్లను
ఆమె తీసుకోవడం కంటే
ఆడది చేసిన త్యాగామేమిటోయ్
      *****
సీత ఓ యుగంలో
ద్రౌపది ఓ యుగంలో
కన్నీరెట్టి
యుగానికొక్కరనిపించారు
మరి ఈ యుగంలో ఏమిటోయ్
       ******

     


Tuesday, March 6, 2012

NEEDA

           నీడ
జీవితం లోని ఎత్తు పల్లాలను
నాకు నేర్పాలని
నా నీడ
అదిగో అలా.........
     ******
           కొబ్బరాకు
అబ్బ పెళ్లి నాటి తెరను
ప్రణయం నాడే
పెడుతున్నావే అంటూ
కొబ్బరాకును కసురుతోంది
జాబిలీ.
         *******
         చెరువు
ఎంత కాలమలా
నిలబడుతుందో అని
తన పై పడిన
చెట్టు నీడను
ఊయలలూపుతోంది
ఆ చెరువు.
          *********

Monday, March 5, 2012

THAPPATADUGULU

తప్పటడుగులలోనే
అందమంతా ఉందని
ఇప్పటిదాకా అలా
వంకరగానే నడిచి
ఏమంత జాగైందని
వరుడి వేలట్టుకున్నావే  
గోదారి.
      *****
నన్నేమైనా అనుకో
ప్రళయం ముంచుకొస్తున్నా
నీతో ఇంకో నూరేళ్ళ జీవితాన్ని
స్వప్నిస్తా.
     ******
ఎంత దాహమై నా పై పడ్డావో
నా హృదయమంతా కరిగించి
నీ దాహం తీర్చాలనుకున్నా
పాడు గాలి ఒక్క క్షణం ఆగితేగా
అంటుంది ఆ చెరువు
తన పై పడిన చెట్టు నీడతో.
        *******

Sunday, March 4, 2012

KAVITHALU

          కొత్త నీతులు
పిండి కొద్ది రొట్టి
ఏ ఎండకాగొడుగు
ఇచ్చుకో పుచ్చుకో
పని నీది పాట నాది
కాగితానికో కానుక అంటూ
నూతన నీతులు వెలిసాయోయ్
ఆ ప్రభుత్వాఫీస్ గోడలపై.
         ********
నేడు అన్నిటికన్నా
ఆలస్యంగా పండే ఫలం
పాపఫలం ఎంత ఆలస్యమంటే
ఒక జీవితకాలం చాలనంత
ఇది తెలిసేనేమో మన నేతలు
ఎంత పెద్ద పాపమైనా ..................
            *********

Friday, March 2, 2012

PEYDODI PRAANAM

       పేదోడి ప్రాణం
అందని ద్రాక్ష లాగ
అందని వైద్యం
అనుకోలేకపోతోంది
పేదోడి ప్రాణం.
         *****
       విలువలు
అరుదుగా
విలువల పూలు పూయిస్తూ
కళ కు తాను ప్రమాణమై
కూర్చుందా వెండి తెర.
      *****
        అభిసారిక
ఏడ్చి ఏడ్చి ఇక ఏడ్వలేక
మోడై ఎదురు చూస్తూ
నిలబడిన అభిసారిక ఆ తోట
శిశిరాన.
        ********