Wednesday, October 30, 2013

హస్తభూషణం

హస్తభూషణం
పుస్తకం హస్తభూషణమని అన్నందుకు 
నన్ను చెరసాలలో పెట్టాలంటోంది 
నా చరవాణి. 
******
విలువలు
గోడలు దాటి విజ్ఞానం బయటకు రానపుడు 
గుండెలు దాటి లోనికెలా పోతాయోయ్
విలువలు. 
******
బలం
నమ్మడానికి 
ఇంత తేలికపాటి మనుషులు దొరికే ఈ దేశాన
అబద్ధాలకు వేయిటన్నుల బలమెందుకు?
******
గస్తీ 
ఆడది... అర్ధరాతిరి.... స్వేచ్ఛ.... 
అని ఆనాడు ఆ మహాత్ముడు అన్న మాటను 
నిజం చేయడానికి, కర్ర చేతపట్టి 
గల్లీగల్లీ లోను గస్తీ తిరగాలేమో 
ఇపుడా గాంధీ విగ్రహాలు
*******

Thursday, October 24, 2013

ఉల్లి

ఉల్లి
కొస్తే కాదు చూస్తుంటేనే 
చూస్తుంటేనే కాదు అంటుంటేనే
అంటుంటేనే కాదు వింటుంటేనే!
ఎన్ని దారులో చూశావా 
నా కంట నీరు తెప్పించడానికా ఉల్లికి. 
********
దారిద్ర్యం 
దారిద్ర్యమే పట్టకపోతే!
అంతటి వైభోగమెక్కడిదా నటికి 
అదేనోయ్ వస్త్ర దారిద్ర్యం. 
*******
దృశ్యకావ్యం 
గట్టుమీది కొబ్బరాకును కలంగా పట్టి,
ఈ చెరువు నీటిని సిరాగా పోసి 
నే రాసిన దృశ్యకావ్యాన్ని!
వీక్షిస్తూ మురిసిపోయే మనసులెన్నో 
ఈ పున్నమిరాతిరిన
********
పరిమళం  
తొలకరిన ఆకులను పూయించిన 
ఆ వాన చినుకులను!
ఏవి ఆ పూలపరిమళాలని అడిగానో లేదో!
నా మనసుని పల్లవిస్తూ తాను కరిగిందా మన్ను. 
********

Tuesday, October 22, 2013

మృగతనం

మృగతనం
లేత అద్దాల చెక్కిళ్ళలో 
అప్పుడప్పుడు, అక్కడక్కడ మృగాలు కొన్ని 
మగతనం చూసుకుంటున్నాయి 
*******
కాలం చెల్లిన ఆభరణాలు
ఆటపాటలనే కాలం చెల్లిన ఆభరణాలు 
తనకొద్దంటూ, ఎంత కళావిహీనంగా 
పరుగు పెట్టేస్తోందో చూడీ బాల్యపు విజ్ఞానం 
********
కరుణించే  మనసు
విసురుగా కురిసే వాన చినుకులకు 
పుడమిని చీల్చే పదునెక్కడిది,
కరిగి కరుణించాలనే వెన్నలాటి మనసు 
ఈ మన్నుకు లేకుంటే. 
*******
అహం
ఎక్కడలేని గౌరవాన్ని 
నీకు తెస్తానన్న ముసుగులో,
నీకు నిన్ను దూరం చేసేదే అహం. 
*******

Sunday, October 6, 2013

జోలపాట

జోలపాట
నడిరోడ్డుపై, కాసింత కారుణ్యానికై
వేదనతో జోలె పడుతున్న తల్లి
ఆక్రందనలో పడి,కొట్టుకుపోతున్న జోలపాటనెలా పట్టుకుని
నిద్దరోతోందో ఆ ఒడిలోని శిశువు.
*******
ఐకమత్యం
నేటి కాలాన
ఐకమత్యం సాధించే
నిష్ఫలమేమిటో చెప్పనా!
పూలన్నీ దండగా మారి,
దండగమారి నేతల పాల్బడడమే.
********
మానవత
అన్ని కన్నీళ్ళను చల్లినంత మాత్రాన
సొమ్మసిల్లి పడిపోయినా మానవత
లేస్తుందా? చెప్పు.
*******
అద్దం
కదలకుండా నిలబెట్టి
నన్ను నిలువుదోపిడి చేస్తూనే!
తనపై నవ్వుల పూలు వేయించుకునే
కళనెక్కడ నేర్చిందో ఈ అద్దం.
*******